ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ను చూసి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతగానో భయపడిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రస్తుతం పులివెందులలో చిన్న ఎన్నిక కోసం జరుగుతున్న పరిణామాలను చూస్తేనే జగన్ అంటే చంద్రబాబు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుందని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ మాట్లాడారు.
వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్పై దాడి చేసి హత్య చేసేందుకు యత్నించినప్పటికీ ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా అరెస్టు చేయలేదని టీజేఆర్ తెలిపారు. తప్పుడు ఫిర్యాదుతో వైసీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని అన్నారు. రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వం నేతలు గౌరవించడం లేదని విమర్శించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనమని వివరించారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కేవలం వైసీపీకి కూటమి పార్టీలకు మాత్రమే కాదని.. వైసీపీకి పోలీసులకు, వైసీపీకి ఎన్నికల సంఘానికి మధ్య జరుగుతున్నాయని టీజేఆర్ అన్నారు. సీఎం స్థాయిలో కూర్చున్న వ్యక్తి జడ్పీటీసీ ఎన్నికను పర్యవేక్షించడం చంద్రబాబు హయాంలోనే మొదలైందని అన్నారు. డీజీపీ కార్యాలయానికి వెళ్తే పోలీసులను పెట్టి వైసీపీ నేతలను ఆపిస్తున్నారని తెలిపారు. అసలు డీజీపీ రాష్ట్రానికా? టీడీపీకా? అనేది అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు వస్తే ఔట్ వార్డులో కంప్లయింట్ ఇచ్చి వెళ్లమంటారా? అని ప్రశ్నించారు. ఎస్సీ నేతలమని తమపై డీజీపీ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ కార్యాలయానికే కాదు.. ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లినా ఇదే తంతు జరుగుతుందని అన్నారు. చంద్రబాబు దృష్టిలో పడాలని అధికారులు పోటీలు పడుతున్నారని తెలిపారు. మార్చిన పోలింగ్ కేంద్రాలు యథాస్థానంలో ఉంచాలని సూచించారు. తమ నేతలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.