Jethwani Case | ముంబయికి చెందిన నటి జత్వాని కేసులో ఏపీ సీఐడీ కీలక చర్యలు తీసుకున్నది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులైన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది. మే 5న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. గతంలో ఇద్దరు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు.. ప్రస్తుత విచారణలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించిన వివరాల్లో వైరుధ్యాలు ఉండడంతో మళ్లీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ కేసులో సీఐడీ ఆంజనేయులును విచారిస్తున్న విషయం విధితమే. గతంలో కాంతి రాణా టాటా, విశాల్ గున్ని వెల్లడించిన కొన్ని అంశాలను ఖండించినట్లు సమాచారం.
నటి జత్వానిని ముంబయి నుంచి తీసుకురావాలన్న టాస్క్‌ను తనకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఉన్న ఆంజనేయులు తనకు అప్పగించారని విశాల్ గున్నీ సీఐడీకి తెలిపినట్లు సమాచారం. అయితే, తాను విశాల్ గున్నీతో కేవలం నిఘాకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడి ఉంటానని.. జత్వాని విషయంపై ఇద్దరు ఐపీఎస్‌లతో చర్చలు జరుపలేదని ఆంజనేయులు విచారణలో చెప్పినట్లు తెలిసింది. గతంలో సీఐడీ కాంతి రాణా, విశాల్ గున్నీలను ఈ కేసులో ప్రశ్నించింది. తాజాగా ఆంజనేయులు ఇచ్చిన వాంగ్మూలం ఇవ్వగా.. ఇందులో ఒకదానితో ఒకటి ఏమాత్రం పొంతన కుదరడం లేదని.. ఈ క్రమంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు.. ఇద్దరు ఐపీఎస్‌ల నుంచి వివరాలను మరింత స్పష్టంగా తెలుసుకునేందుకు సీఐడీ నిర్ణయించి.. నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.