అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ( Amaravati ) వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ రెండవ ప్రాకారం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ( Chandrababu ) భూమిపూజ, అద్వేష్టక శిలేష్టకాన్యాసం నిర్వహిం చారు. ఈ సందర్భంగా యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతిలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం అర్చకుల వేద మంత్రాలు, మంగళవాయిధ్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య సీఎం పునాది రాయి వేసి ఆలయంలో ద్వితీయ మహాప్రాకారము, చతుర్థ్యార గోపురముల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని అమరావతిలో తిరుమల తరహాలో శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని కృతనిశ్చయంతో పనులకు భూమి పూజ చేశామన్నారు. కృష్ణా నది ఒడ్డున శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తే అదే మనకు శక్తి నిస్తుందన్నారు.

దేవతల రాజధాని అమరావతి ఎలా ఉండేదో, అదే తరహాలో ఇక్కడ శ్రీవారి ఆలయం ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.ముఖ్యమంత్రిగా ఉన్నా ఓ సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో తప్పు చేసిన వారిని రెండు మూడు తరాల తర్వాత శిక్ష అనుభవించేవారని, ఇపుడు ఈ జన్మలోనే శ్రీవారు శిక్షిస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నామన్నారు.
తనను అంతమొందించేందుకు నక్సలైట్లు 23 క్లైమోర్ బాంబులు పెట్టినా శ్రీవారు తనకు ప్రాణభిక్ష పెట్టారన్నారు. ప్రతి మనిషికి ఆరోగ్యం, సంపద, సంతోషం ఉండేలా పాలన అందిస్తామన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, కేంద్ర మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పి.నారాయణ, నాదెండ్ల మనోహర్ , టీటీడీ బోర్డు సభ్యులు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో తదితరులు పాల్గొన్నారు.