అమరావతి : ఏపీ మంత్రివర్గం (AP Cabinet) పలు కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించే ( Regularization ) నిర్ణయానికి సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandra Babu) అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరిపారు.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై మంత్రుల కమిటీ (Ministers committee) ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ మంత్రుల కమిటీ వచ్చే కేబినెట్ భేటీలోగా భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశించారు. సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో నిషేధిత జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లు వెల్లడించారు.
63 అన్న క్యాంటీన్లు ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా మరో 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్లు ఏర్పాటు కు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. విజయవాడ బ్యారెజ్ రైట్ సైడ్వాల్ నిర్మాణానికి రూ. 290 కోట్లు మంజూరికి కేబినెట్ ఆమోదం వ్యక్తం చేసిందన్నారు. ఇటీవల సేకరించిన ధాన్యానికి అవసరమయ్యే మరో రూ. 700 కోట్లు రుణాలను సేకరించడానికి ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 6,200 కోట్లు జమ చేశామని మంత్రి పేర్కొన్నారు.
రేపు రాష్ట్రానికి రానున్న అమిత్ షాకు ( Amit Shah) ఘనస్వాగతం పలకాలని సమావేశం నిర్ణయించిం దన్నారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనపై కేబినెట్ చర్చించి టారిఫ్ల తగ్గింపును మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం, రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు.