Daggubati Purandeshwari | ఏపీలో ఎన్డీయే కూటమి అనూహ్య విజయం సాధించిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇది చిన్న విజయం కాదని.. అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ విజయం తమకు ఒక హెచ్చరిక లాంటిదని సూచించారు. పాలన గాడితప్పితే ఎలా గుణపాఠం చెబుతారో ప్రజలు చూపించారని వ్యాఖ్యానించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయకపోతే ప్రజలు గుణపాఠం చెప్పగలరని ఈ ఫలితాల ద్వారా నిరూపించారని పురంధేశ్వరి అన్నారు. కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదని.. ఒక నిశ్శబ్ద విప్లవంలా ప్రజలు వచ్చి ఓట్లు వేశారని వ్యాఖ్యానించారు. కూటమికి అధికారం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో కొత్త శకం ఆరంభమైందని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సమన్వయంగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని.. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని పేర్కొన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదని గుర్తు చేసిన పురంధేశ్వరి.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసకెళ్లాల్సిన బాధ్యత మనపైనే ఉందని బీజేపీ నాయకులతో అన్నారు. అధికారంలో ఉంటూనే పార్టీని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.