అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ (AP Assembly) , మండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా మండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు ఉదయం జరిగిన బీఏసీ సమావేశం స్పీకర్ అయ్యన్నపాత్రుడి (Speaker Ayyannapatrudu ) అధ్యక్షతన జరిగింది. వర్షకాల అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 వరకు నిర్వహించనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. కాగా ఈనెల 20, 21, 28 తేదీల్లో సెలవు ఉండనుందని వెల్లడించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ, 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ఈనెల 19న జలవనరుల అంశం, 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్-6, 26న క్వాంటం వ్యాలీ, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ-కోస్తా-ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశంపై చర్చ చేపడుతామని స్పీకర్ వివరించారు.