అమరావతి : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (AP Assembly) రాజధాని అమరావతిలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బుధవారం శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ( Speaker Ayyanapatrudu ) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ, డీజీపీ తోపాటు ఇతర కీలక అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు బందోబస్తుపై చర్చించారు. ఉభయసభల సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. కాగా ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు (YCP Members ) హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఆ పార్టీ ఇప్పటి వరకు తాము సమావేశాలకు హాజరు అవుతామని ఇంకా ప్రకటించకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. తమ తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఇదో సదావకాశంగా ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. సభాపతి స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందని అన్నారు. సభకు వస్తే ప్రజా సమస్యలు చర్చించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తానన్నారు. గురువారం ఉదయం బీఏసీ సమావేశంలో శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయిస్తామని పేర్కొన్నారు.