అమరావతి : ఏపీ అసెంబ్లీ మూడోరోజు సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని రైతు వ్యతిరేకి వైఎస్ జగన్ అంటూ నినాదాలు చేశారు. రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించక పోవడంతో పొడియం వద్దకు దూసుకొచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సభలో కీలక అంశాలపై చర్చించాలని అందుకు సహకరించాలని టీడీపీ సభ్యులను అభ్యర్థించారు. అందుకు అంగీకరించకపోవడంతో సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ఆర్అండ్ ఆర్ పరిహారం కింద గతంలో రూ. 6.86 లక్షలు ఇస్తే తాము అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పి అమలు చేశామన్నారు.
ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ బల్క్ డ్రగ్స్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీపడగా ఏపీకి ఆ అవకాశం దక్కిందని అన్నారు. బల్క్‌డ్రగ్ వద్దని చంద్రబబు కేంద్రానికి లేఖలు రాయడం ఆయన సంకుచిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి వరకు కొనసాగనున్నాయి.