హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టును రద్దు చేసినట్లు పేర్కొన్న ఏపీ సర్కారు ఇప్పుడు పోలవరం-నల్లమలసాగర్(పీఎన్) లింక్ ప్రాజెక్టుపై దూకు డు పెంచింది. పీఎన్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్‌ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కిన ఏపీ ప్రభు త్వం తొలుత పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. వరద జలాల పేరిట 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు రూ.80,112 కోట్లతో లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధంచేసింది.
డీపీఆర్ తయారీకి సైతం టెండర్లను ఆహ్వానించిం ది. కేంద్ర సంస్థలు, కో బేసిన్ రాష్ర్టాలు, ఏపీలోని మేధావులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో వెనకడుగు వేసింది. బనకచర్ల లింక్‌లో పలు మార్పులు చేసి కొత్తగా పోలవరం-నల్లమలసాగర్ లింక్‌ను తెరమీదికి తీసుకొచ్చింది. తొలుత బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా గోదావరి వరద జలాలను ప్రకాశం-బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా పోతిరెడ్డిపాడు దిగువన బనకచర్ల హెడ్‌రెగ్యులేటరీ వరకు తరలించాలని భావించింది.
ప్రస్తుతం అందులో స్వల్ప మా ర్పులు చేసింది. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు కాకుండా నల్లమల రిజర్వాయర్‌కు గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందుకు రూ.58 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. తాజాగా పీఎన్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ సిద్ధమైంది. రూ.9కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను ఏపీ జలవనరులశాఖ జారీ చేసింది. 27న బిడ్ డాక్యుమెంట్లను అందుబాటులో పెట్టడంతోపాటు, డిసెంబర్ 11వ తేదీ వరకు టెండర్లు కాల్ ఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది.