అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌గా(APPSC chairman ) రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాధ (Anuradha) గురువారం విజయవాడలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెతో ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రమాణస్వీకారం చేయించారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు బోర్డు సభ్యులు, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
అనంతరం ఏపీపీఎస్సీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న నియామకాలపై సమీక్షించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 సహా నిర్వహించాల్సిన పలు నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. ఏఆర్ అనురాధ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలోఎస్పీగా, ఐజీగా పనిచేశారు. ఏపీలో ఇంటెలిజెన్స్ (Inteligence) విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్(IPS) అధికారిగా గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కూడా ఆమె పనిచేశారు.
1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి కావడం విశేషం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. మరో ఏడాది పదవీ కాలం ఉన్నా సవాంగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా ఆరోపించింది.