తిరుమల : తిరుపతి లడ్డూల ( Tirupati laddus) తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ దర్యాప్తు సక్రమంగా జరుగలేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( BR Naidu ) , సభ్యులు ఆరోపించారు. శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పూర్తి దర్యాప్తు కోసం మరో సప్లిమెంటరీ చార్జ్‌షీటు ( Supplementary charge sheet ) దాఖలు చేస్తామని వెల్లడించారు. మైక్రో డీఎన్ఏ చేయాలని కోరుతున్నామని అన్నారు.
సుప్రీంకోర్టుకు సిట్ ఇచ్చిన నివేదిలో ఎక్కడా కూడా లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వాడలేదని చెప్పలేదని, అదేవిధంగా కల్తీ నెయ్యి వాడారని వెల్లడించిందని అన్నారు. వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాలు, వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చింది. కొన్ని కెమికల్స్‌తో కల్తీ నెయ్యిని వాడి సుమారు 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులకు పంచి పెట్టి మహా పాపం చేశారని విమర్శించారు.
లడ్డూల తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడి భక్తుల ప్రాణాలతో ఆటలు ఆడుకున్నారని ఆరోపించారు. నాటి చైర్మన్ వైఎస్ సుబ్బారెడ్డి, ముఠా మేస్త్రీ వైఎస్ జగన్ సహకారం లేనిదే ఒక ప్రైవేట్ వ్యక్తి నెయ్యి సరఫరా ద్వారా కోట్లాది రూపాయలు లావాదేవీలు జరుపడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు.
ఐదేళ్లపాటు ప్రతి విషయంలోనూ నియమ, నిబంధనలను తూట్లు పొడిచి టీటీడీని భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. క్రిమినల్స్ అంతా కలిసి ప్రణాళిక ప్రకారం హిందువు మనోభావాలను దెబ్బదీసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హిందువులంతా ఏకమై శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.