అమరావతి : ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ( YSRCP ) ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) సొంత జిల్లాలో పలువురు వైసీపీ నాయకులు రాజీనామాలు చేస్తుండడం పట్ల ఆ పార్టీలో కలవరం మొదలైంది. తాజాగా మైదుకూరు మున్సిపల్ చైర్మన్( Muncipal Chairman) చంద్ర ( Chandra ) పార్టీకి రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న చంద్ర జగన్‌తో మాట్లాడించాలని మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక తయారు చేసుకుంటానని వెల్లడించారు.
నిన్న శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా
వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం (Zakia Khanam) తన పదవికి , పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్రా కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జకియా ఖానం మాట్లాడుతూ ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా కల్పిస్తున్నారని వ్యాఖ్యనించారు.
ఏడాదిలో ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా
జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. ఆమెను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం మండలి వైస్ చైర్మన్‌గా నియమించింది. కాగా, అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఆమె గత రెండేండ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్‌ను కుటుంబ సమేతంగా కలిశారు. దీంతో ఆమె పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరింది. ఎట్టకేలకు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆమెతో కలిపి ఇప్పటివరకు వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, పోతుల సునీతలు ఉన్నారు.