అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు వాన ముప్పు ఇంకా తొలగిపోలేదు. వర్షకాల సీజన్ ముగిసినప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు వరద ప్రభావానికి లోనై తీవ్ర పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఏపీపై మరో అల్పపీడనం ఏర్పడ వచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం కోమరిన్ ప్రాంతంతో పాటు దానిని ఆనుకొని ఉన్న శ్రీలంక తీర ప్రాంతానికి చేరుకుంది.
ఇది సగటు సముద్ర మట్టానికి.. 1 .5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 29 తేదీవరకు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర లోని పలు ప్రాంతాల్లో.. నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు.కొన్ని చోట్ల తేలికపాటి, ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొన్నారు.