అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) మరో డ్రామాకు తెర తీశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ వేశారని ట్వీటర్లో (Twitter) ఆరోపించారు. చంద్రబాబు విడుదల చేసిన పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదని, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదని విమర్శించారు.
తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ధ్యాస ఉండదని, ఎప్పుడూ ప్రజలను మోసం చేయడం, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుందని ఎద్దేవా చేశారు. 1998లో విజన్-2020 పేరిట డాక్యుమెంట్ (Vision Documents) విడుదల చేయడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయమని అన్నారు. రైతుల ఆత్మహత్యలు( Farmers Suicide) , పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదని వెల్లడించారు.
స్విట్జర్లాండ్‌కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్లు పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో, లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2014లోకూడా విజన్-2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని విమర్శించారు.
తన పరిపాలనలో మొత్తం ౩ విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గంగలో కలిపిన పాలకుడిని చీటర్ అంటారు కాని, విజనరీ అంటారా? అని ప్రశ్నించారు. విజన్-2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లు చేస్తానంటూ చంద్రబాబు కట్టుకథ చెబుతున్నాడని ఆరోపించారు.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు వైసీపీ దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపుమాపి, అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి దిశగా అనేక చర్యలు తీసుకుందని వెల్లడించారు. పేదలకు ప్రవేశపెట్టిన పథకాలు తొలగించి మరింత పేదవాళ్లుగా చంద్రబాబు తయారు చేస్తున్నాడని విమర్శించారు.