అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Ankapalli) జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీల్లో (Pharma Blast) వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువకముందే పరవాడ ఫార్మా సెజ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకున్నది. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం వారంతా ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే శరీరం 70 శాతం కాలిపోవడంతో క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రసాయనాలు కలుపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు.
రెండురోజుల క్రితం (బుధవారం) ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 35 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ఈ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. తీవ్ర గాయాల పాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షలు సాయం అందిస్తామని తెలిపింది. కాగా, వరుస ప్రమాదాలతో జిల్లా ప్రజలు, కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.