తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో బుధవారం సాలకట్ల ఆణివార ఆస్థానం ( Anivara Asthanam) శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం బంగారు వాకిలి ఎదుట ఉన్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి( Malayappa Swamy) విగ్రహాలను గరుత్మంతునికి అభిముఖంగా తీసుకువచ్చి , మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనులను దక్షిణాభిముఖంగా కూర్చుండబెట్టారు.
అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరంపెద్దజీయర్స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో, ఇతర ఉన్నతాధికారులు నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామి వారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తలకు శ్రీవారి పాద వస్త్రంతో ‘ పరివట్టం’ ధరించి స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘ నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు పెద్ద జీయర్, చిన్న జీయర్‌కు, టీటీడీ తరఫున ఈవోకు ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. ‘రూపాయి’ హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు అనంతరం తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసిందని అర్చకులు తెలిపారు.