CM Chandrababu | అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు సరిగా హాజరు కాకపోవడంతో సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయానికి రాకుండా.. ఆలస్యంగా వచ్చి, అసెంబ్లీ సమావేశాలు పూర్తికాక ముందే పలువురు ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కీలక చర్చల సమయంలో సభ్యుల గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం.
సమావేశం ప్రారంభమయ్యే సమయానికి శాసనసభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనిపించడంతో సీఎం ఆగ్రహావేశాలతో ఊగిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో అసెంబ్లీలో విప్‌లను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం ఆరా తీయడంతో.. సమావేశానికి డుమ్మా కొట్టిన 17 మంది ఎమ్మెల్యేలకు విప్‌లు ఫోన్లు చేసి అప్పటికప్పుడు పిలిపించారని వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.