Shyamala | ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరిగాయని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. ఈ అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్యామల మంగళవారం మీడియాతో మాట్లాడారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వ పెద్దలకు కనీస సామాజిక బాధ్యత లేదని మండిపడ్డారు.
ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని శ్యామల అన్నారు. కూటమి పాలన చీకటి కాలంగా మారిందని విమర్శించారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అన్నారు. ప్రత్యర్థ పార్టీలను వేధించడానికే పోలీసులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడికి కాస్త కూడా బాధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చామని శ్యామల గుర్తుచేశారు. దిశ యాప్ ద్వారా ఎంతోమంది మహిళలకు న్యాయం జరిగిందని చెప్పారు. కానీ రాజకీయ దురుద్దేశంతో దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే దిశ చట్టంపై బురదజల్లారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 74 మందిపై అత్యాచారాలు జరిగాయని.. ఆరుగుర్ని హత్య చేశారని తెలిపారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మళ్లీ విజృంభిస్తుందని పేర్కొన్నారు. మహిళలపై దాడులను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని.. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.