తిరుమల : తిరుమలలో అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్థశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం జరిపారు.
అనంతరం చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో ఇవాళ అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రత్తాళ్వారులకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వీజీవో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి అధికారులు పాల్గొన్నారు.