అమరావతి: పంటల బీమా పరిహారం అందని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీమా పరిహారం అందని రైతులు మరోసారి దరఖాస్తు చేసుకుంటే తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్బీకేల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నది.
పంటల బీమా పరిహారాన్ని ఏపీ సర్కార్ ఇటీవల విడుదల చేసింది. అయితే, పరిహారం పొందే వారి జాబితాలో పెద్ద సంఖ్యలో రైతుల పేర్లు మిస్ కావడంతో ఆయా రైతుల కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. తమకు కూడా పరిహారం ఇవ్వాలంటూ వారు కలిసిన వారిని వేడుకుంటున్నారు. ఈ విషయం ప్రభుత్వం చెవిన పడటంతో వెంటనే స్పందించింది. బీమా పరిహారం అందని రైతులకు మరో అవకాశం కల్పిస్తామని ప్రకటించింది.
ఖరీఫ్-2021 సీజన్ బీమా పరిహారం అందని రైతులు తమ పేర్లు, వివరాలను ఆర్బీకేల్లోని వీఏఏల వద్ద నమోదు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి దశలవారీగా అర్హులైన వారికందరికీ డబ్బును జమ చేస్తామని స్పష్టం చేసింది. అలాగే, పీఎం కిసాన్ పోర్టల్లో నమోదైన పెండింగ్ దరఖాస్తుల ఈకేవైసీ, దరఖాస్తుల ధృవీకరణను వచ్చే నెల 15 లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.