తిరుమల : ప్రకృతి వైపరీత్యాల నుంచి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నిపుణులు వీలైనంత త్వరగా తిరుమల ఘాట్ రోడ్లపై సమగ్ర నివేదిక అందించాలన్నారు. తిరుమలలో సంభవించే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అమృత విశ్వవిద్యాలయం నిపుణులను కోరారు. అదేవిధంగా విపత్కర పరిస్థితులను ముందస్తుగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో ఆయన అమృత విశ్వవిద్యాలయం నిపుణులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాతా అమృత విశ్వవిద్యాలయం నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్ మాట్లాడుతూ.. తిరుమల వెళ్లే ఘాట్ రోడ్లలో ఎక్కడెక్కడ మట్టి మెత్తగా, గట్టిగా ఉన్నది అనే విషయాలు తొలుత గుర్తించాల్సిన అవసరం ఉన్నదన్నారు. వర్షాలు సంభవించినప్పుడు వర్షపు నీరు వెళ్లేలా కల్వర్టులు ఏర్పాటుచేసి డ్రైనేజ్ సిస్టం మరింత మెరుగు పర్చాలని సూచించారు. తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డు వాలుగా ఉన్నదని, వరదల వల్ల ఇబ్బందులు తలెత్తినప్పుడు లింక్ రోడ్డును ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనే విషయాన్ని వారు వివరించారు. ఈ సమీక్షలో అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, సీఈ నాగేశ్వర రావు, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ
గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో యువ రైతులు పాల్గొనేలా ప్రోత్సహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో గోశాల నిర్వాహకులతో ఈఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు గోశాలల్లో 2500 గోవులు మిగులుగా ఉన్నాయని, వీటిని జూన్‌లోగా అవసరమైన రైతులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నోడల్ గోశాలల్లోని గోవుల ఆరోగ్యాన్ని పరీక్షించడం, గోవులకు అవసరమైన మేత, రైతులకు అందించేందుకు రవాణ ఛార్జీల కోసం ఆర్థిక సహాయం తదితర అంశాల పై చర్చించారు .
తిరుపతిలో ఇటీవల నిర్వహించిన శిక్షణ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందని గోశాల నిర్వాహకులు ఈఓకు తెలిపారు. శ్రీకాళహస్తిలోని గోశాలలో మే రెండో వారంలో శిక్షణ కార్యక్రమం జరుగనున్నదని నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి గోశాలలో ఒక్కో రకమైన నైపుణ్యం ఉన్నదని, వాటిని ఉపయోగించుకొని చక్కటి పంచగవ్య ఉత్పత్తులు తయారు చేయవచ్చని వారు వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏఓ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఆచార్య వెంకట నాయుడు, గోశాల నిర్వాహకులు శశిధర్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.