అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేయాలంటూ ఇక్కడి రైతులు 99 శాతం మంది తమ భూములను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని, ప్రపంచంలోనే ఇలా భూములిచ్చిన ఏకైక ప్రాంతం అమరావతి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వారసత్వాన్ని కాదనుకుని రాజధాని ఏర్పాటు కోసం రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పారు. మంగళగిరిలో టీడీపీ పాలిట్బ్యూర్ సమావేశం జరిగింది. అనంతరం టీడీపీకి చెందిన సర్పంచ్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ప్రధానమంత్రి మోదీ మొదలుకొని ఎందరో అతిరథ మహారధులు వచ్చి అమరావతి ఏర్పాటు కావాలని ఆకాంక్షించారని చంద్రబాబు చెప్పారు. అయితే, వీటన్నింటిని తోసిరాజని సీఎం జగన్ మూడు ముక్కలాటకు తెరలేపారని దుయ్యబట్టారు. ముంపునకు గురవుతుందని లేనిపోని ఆరోపణలు చేశారని, ఎడారి అని, శ్మశానం అని తప్పుడు మాటలు మాట్లాడి రాజధాని ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. భూమి ఇచ్చిన రైతులకు భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే పకడ్బంధీగా సీఆర్డీఏ చట్టం తీసుకొచ్చామని తెలిపారు.
రాజధాని కోసం ఆందోళన చేసిన మహిళల్ని చాలా దారుణంగా అవమానించారని, దుస్తులు చించారని, కొట్టారని చంద్రబాబు చెప్పారు. అయినప్పటికీ ధర్మం, కోసం మహిళలు పోరాడి విజయం సాధించారని కొనియాడారు. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడిచిపోయాయని, ఇంకా ఉన్న ఈ రెండేండ్లలో వారు చేయగలిగింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. వారు తమ చేష్టలతో చరిత్ర హీనులుగా మాత్రం మిగిలిపోవడం ఖాయమన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. ఇవాల్టి విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.