Srisailam | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల దేవస్థానం క్షేత్రపాలకుడైన బయలువీరభద్రుడికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణు ఘోషలతో క్షేత్రం మారుమోగింది. అమావాస్య సందర్భంగా ప్రదోషకాలంలో వీరభద్రుడికి పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ, విభూది, గంధ జలాలు, బిల్వోదక సుగంధ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు, విశేష పుష్పార్చన, మహా నైవేద్యం సమర్పించారు. లోక కల్యాణం కోసం ప్రతి మంగళ, అమావాస్య రోజుల్లో వీరభద్రుడికి అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అంతకు ముందు కార్యక్రమం నిర్విఘనంగా సాగాలని మహాగణపతి పూజ నిర్వహించారు.
ఇక ఆరుబయట ఆలయంలో దర్శనమిచ్చే వీరభద్రుడిని పూజిస్తే భూతప్రేత, పిశాచ, దుష్టగ్రహదోషాలు తొలిగి సర్వకార్యానుకూలతతోపాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొన్నారు. పరీక్షసేవ ద్వారా 17 మంది భక్తులు విశేష పూజల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పంజాబ్‌కు చెందిన భక్తులు పాల్గొన్నారు. ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు. కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు దేవస్థానానికి చెందిన 8333901351 / 52 / 53 నంబర్లలో సంపద్రించాలని కోరారు.