అల్లూరి జిల్లా: వచ్చే నెల 4 వ తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పారు. అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. భీమవరంలోని ఏఎస్ఆర్ పార్కులో రూ.30 కోట్ల వ్యయంతో 30 అడుగుల ఎత్తైన అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
దాదాపు 15 టన్నుల బరువు ఉండే ఈ విగ్రహాన్ని పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో తయారు చేయించారు. దీని తయారీకి 10 టన్నుల కాంస్యం, 5 టన్నుల ఇనుము వాడారు. అల్లూరి అతిపెద్ద కాంస్య విగ్రహం ఇదేనని క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులు అల్లూరి విగ్రహాన్ని సందర్శించారు.
అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ దిమ్మెపై నిలబెట్టారు. విగ్రహం ఆవిష్కరణ నాటికి పార్క్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానుండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నుంచి ఆహ్వానం అందింది.