అమరావతి : అమరావతి ( Amaravati ) పేరుతో చంద్రబాబు అంతులేని అవినీతి, మోయలేని అప్పులు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ( Perni Nani ) ఆరోపించారు. మావిగన్ ( Mavigan ) పేరు చెప్పగానే కూటమి నేతల్లో భయం చుట్టుకుంటుందని విమర్శించారు. వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజధాని ఎప్పుడు పూర్తి అవుతుందో , ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి రూ. 50 వేల కోట్లు అప్పులు తెచ్చి ఆఫీసులు కడుతున్నారని పేర్కొన్నారు. రైతుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడు తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులను కలిసేందుకు వెళ్తే దాడులు చేస్తున్నారని అన్నారు. కచ్చితంగా అమరావతి రైతుల వద్దకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
రాజధానిలో పేదలకు జగన్ ఇచ్చిన 50 వేల ఇళ్ల పట్టాలు రద్దు చేశారని,జనాలు లేని చోటు రాజధాని ఎందుకని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారని నిలదీశారు. యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. కులాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని పేర్నినాని విమర్శించారు. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్ టెర్రస్‌పై కాల్చి బూడిద చేశారా? స్టేషన్లో సీసీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.