తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల (Annual Brahmotsavam) సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ (Garuda Seva) కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో బుధవారం సాయంత్రం అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ గరుడ సేవ రోజులన భక్తుల సౌకర్యార్థం వయోవృద్ధులు దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు (Special Darsan Cancell) చేయడంతో పాటు, అన్ని ఆర్జిత సేవలను టీటీడీ(TTD) రద్దు చేసిందని చెప్పారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.
గ్యాలరీలలోనికి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణపై చర్చించారు. పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడం, భక్తుల రవాణా, పార్కింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అదనపు ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీ సీఇ సత్యనారాయణ, తిరుమలలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.