Srisailam | శ్రీశైలం : మల్లికార్జున స్వామి భక్తుల్లో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంత్యోత్సవాన్ని శనివారం దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేషపూజలు నిర్వహించారు. మొదట జయంత్యోత్సవ సంకల్పం పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. అనంతరం స్తోత్రపఠనతో అక్కమహాదేవి వారిని పంచామృతాలతోనూ, ఆలయప్రాంగణంలోని మల్లికాగుండ జలంతోనూ అభిషేకం నిర్వహించారు. చివరగా అక్కమహాదేవి వారికి పుష్పాంజలి సమర్పించారు. కాగా, 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివశరణులుగా ప్రసిద్ధి పొందిన మహాభక్తుల్లో అక్కమహాదేవి ఒకరు. వీరవిరాగిణిగా పేరొందిన అక్కమహాదేవి, శ్రీశైలమల్లికార్జునస్వామివారిని తమ భాగస్వామిగా భావించి తరించింది.
శ్రీశైల మల్లికార్జునుడిపై ఎన్నో వచనాలను చెప్పిన అక్కమహాదేవి సంస్కృత, కన్నడ భాషల్లో ఎంతో ప్రవీణురాలుగా చెబుతుంటారు. కన్నడ వచన సారస్వతంలో ఈమెను విశిష్ట వచనా రచయిత్రిగా సాహితీవేత్తలు పేర్కొంటారు. ఇప్పటికీ అక్కమహాదేవి వచనాలు శివశరణాలనే పేరుతో ఎంతో ప్రచారంలో ఉన్నాయి. ఈ వచనాలలో మధుర భక్తి కాకుండా జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నో అంశాలు కనిపిస్తాయి. శ్రీశైల మల్లికార్జునునిలో ఐక్యం కావాలనే చిరకాలవాంఛ గల అక్కమహాదేవి తన జీవితపు చివరి రోజులను శ్రీశైలంలోనే గడిపింది. ప్రస్తుతం అక్కమహాదేవి గుహలుగా పిలువబడుతున్న ఇక్కడి గుహల్లోనే కొంతకాలం తపస్సు చేసిన ఈ సాధకురాలు.. ఇక్కడి కదళీవనంలో మరికొంతకాలం తపస్సు చేసి సిద్ధి పొందింది. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. అక్కమహాదేవి జయంతి ఉత్సవం సందర్భంగా సాయంత్రం భ్రామరీ కళావేదికపై అక్క మహాదేవి జీవిత విశేషాలపై డాక్టర్ ఎం మహంతయ్య ప్రవచన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.