తిరుమల: తిరుమలలో (Tirumala) ఆగమశాస్త్ర ఉల్లంఘనలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి విమానం వెళ్లిన ఘటన చోటుచేసుకున్నది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం వెళ్లింది. అయితే ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం ఉండకూడదని గతంలోనే ఆగమ పండితులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తిరుమలను నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో శ్రీవారి ఆలయం పైనుంచి విమానాలు వెళ్తున్నాయి.
ఈ ఏడాది జూన్ 7న శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం 8.14 గంటలకు తీరుమల మీదుగా విమానం ప్రయాణించింది. ఇక ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. ఫిబ్రవరి 15న ఆలయం గోపురం పైనుంచి రెండు జెట్ విమానాలు వెళ్లాయి. కాగా, తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎంపీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.