అమరావతి : ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Quash petition) పై హైకోర్టులో (AP High Court) విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరిన మీదట న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
ఈ సందర్భంగా ఆర్జీవీ తరఫు న్యాయవాదుల వాదనలు వినిపిస్తూ ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పై ఫొటోలు మార్ఫింగ్ (Photos Marfing) చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టినందుకుగాను రాంగోపాల్ వర్మపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు(Cases) నమోదయ్యాయి.
ఈ కేసులపై పోలీసులు రెండు సార్లు నోటీసులు అందించినా వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపులు ప్రారంభించారు. ఇప్పటికే నాలుగురోజులు కావస్తున్న ఆర్జీవీ జాడను పోలీసులు కనుగొనలేక పోతున్నారు. ఈ క్రమంలో హైకోర్టులో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేయగా గత మంగళవారం కోర్టు విచారణ జరిపి వేసింది.