Srisailam | శ్రీగిరి క్షేత్రంలో ఆదిశంకరాచార్యుల జయంతోత్సవాలు వైభవంగా జరిగాయి. శంకరాచార్యులు తపస్సు చేసి శివానందలహరి మహా గ్రంధం రచించిన పుణ్య స్ధలం ఫాలధార-పంచధార వద్ద మంగళవారం ఉదయం వేదపండితులు చతుర్వేద, శాస్త్ర, పురాణాల పారాయణం చేశారు. శారదాదేవి, శంకరాచార్యుల వారికి ప్రీతికరమైన పంచామృతాలు, శుధ్ద గంగాజలంతో విశేష అభిషేకాలు చేశారు. పుష్పార్చనలు నిర్వహించామని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. వివిధ రకాల పుష్పాలతో అర్చనలు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు.
పన్నెండేండ్లకే ఆదిశంకరాచార్యుల వారు చేసిన మహత్కార్యాలను.. దేశం నలుమూలలా స్ధాపించిన పీఠాల వివరాలను.. 16 ఏండ్లకు శంకరాచార్యులవారు అభ్యసించిన చతుర్వేద పారాయణాన్ని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు కండ్లకు కట్టినట్లు వివరించారు. శంకర జయంతి సందర్బంగా బాపట్లకు చెందిన ఉన్నవ గణేష్, జిల్లెళ్ళమూడి వారిచే ఆలయ దక్షిణ మాడవీధి కళారాధన వేదికపై సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానంగా శంకరాచార్యుల వారి జననం, బాల్యం, విద్యాభ్యాసం, సన్యాస స్వీకారం, భక్తిత్వం, గ్రంధ రచన, దార్శనికతతోపాటు శ్రీశైల క్షేత్రంతో శంకరాచార్యులవారి అనుబంధాన్ని భక్తులకు తెలియజేశారు.
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవుళ్లకు వార పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు చేశారు. సాయంకాలం క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాలంలో అభిషేకార్చనలు జరిపించారు. ఆరు బయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు.
సంధ్యా సమయంలో నందిమండపం వద్ద కొలువైన శనగల బసవన్నకు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని అర్చకపండితులు మహా సంకల్పం పఠించారు. పంచామృతాలు ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టించి అష్టోత్తరశతనామ పూజలు జరిపి నూతన వస్త్రం సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు.
శ్రీశైలం మహా క్షేత్రంలో రుద్రమూర్తికి ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. రుద్రవనంలో ప్రతిష్టింపబడిన 14 అడుగుల ఎత్తైన రుద్రమూర్తికి శాస్త్రొక్తంగా పూజాధికాలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. రుద్ర దేవుని చల్లని చూపు కృష్ణానదిపై ఎప్పుడూ పడుతూ ఉండాలని నదికి అభిముఖంగా ప్రతిష్టించిన స్వామి వారికి మంగళవారం ఉదయం అర్చక వేదపండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుధ్ద జలాలతో అభిషేకం చేశారు. అటుపై మహా బిల్వార్చన, పుష్పార్చనలు చేశారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించి రుద్ర దేవుని శాంతి మంత్రాలు వల్లించారు.