అమరావతి : సోషల్ మీడియాలో (Social media) అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ కొత్త డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ( DGP Harishkumar Gupta ) అన్నారు. నూతన టెక్నాలజీ సహాయంతో రాష్ట్రాంలో నేరాలను అరికడతామని వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ( Dwaraka Tirumalrao ) పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఏపీ పోలీసు శాఖలో ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని, రాష్ట్రంలో శాంతి భద్రతల ( Law and Order ) పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో మత్తుపదార్థాల నియంత్రణకు ఈగల్ టీమ్ ( Eagle Team ) ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర కార్యక్రమాలను వివరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ టెక్నాలజీతో పోలీసుల సేవలను కొనసాగిస్తామని కొత్త డీజీపీ అన్నారు. నూతన డీజీపీగా నా శక్తిమేర పనిచేస్తానని పేర్కొన్నారు.
పదవీ విరమణ చేస్తున్న ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లు చూశానని అన్నారు. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని వివరించారు. గడిచిన కొన్ని రోజులుగా సైబర్ క్రైమ్, గంజాయి, చిన్నారులపై నేరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పని చేశారని వివరించారు. క్రమ శిక్షణ, నిజాయితీ, సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.