అమరావతి : ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) కోరారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని సూచించారు. మద్యం తాగి (Drunken Drive) వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య (Annamaiah District) జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ కడప జిల్లాకు చెందిన యువకులు అంజినాయక్ (29), షేక్ అలీమ్ (32), జితేంద్ర (22), షేక్ అఫ్రోజ్ (30) ప్రమాదంలో మరణించారని, షేక్ ఖాదర్ బాషా (20) అనే యువకుడు గాయపడ్డాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్నారని , వీటిని అరికట్టాలని ఆదేశించారు. ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు దహన సంస్కరాల కోసం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.