అమరావతి : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రధాన నగరాల మధ్య ప్రారంభానికి సిద్ధమైన వందే భారత్ ట్రైన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వందే భారత్ ట్రైన్ తయారైన చెన్నై కోచ్ ఫ్యాక్టరీ నుంచి ట్రయల్ రన్లో భాగంగా నిన్న విశాఖపట్టణానికి చేరుకుంటున్న సమయంలో కంచెరపాలెం రామ్మూర్తి పంతులు గేట్ వద్ద ముగ్గురు రాళ్లతో దాడి చేశారు. దీంతో 11,14వ కోచ్‌లకు చెందిన ఒక్కో అద్దాన్ని నిందితులు పగులగొట్టారు.
అత్యాధునికమైన ఈ వందే భారత్‌కు ద్వారాల మధ్య అమర్చిన సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలను గమనించిన రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే పోలీస్‌లు, స్థానిక పోలీసుల సహకారంతో ముగ్గురు నిందితులను గుర్తించారు. శంకర్, దిలీప్, చందు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ధ్వంసమైన అద్దాల స్థానంలో రైల్వే సిబ్బంది గురువారం మరమ్మతులను చేసి కొత్త అద్దాలను అమర్చారు. వందే భారత్ రైలును ఈనెల 19 న సికింద్రాబాద్ లో ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ రైలును ఈనెల 15న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధాని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నట్లు సమాచారం.