హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి నలుగురికి గాయాలయ్యాయి. బీ-బ్లాక్‌లోని మొదటి అంతస్తు రియాక్టర్లో కెమికల్ చార్జింగ్ చేస్తుండగా మ్యాన్‌హోల్ నుంచి రసాయనం ఉప్పొంగి కార్మికులపై పడింది. దీంతో జార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్, కోహర్, రోస, విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖలోని ఇండస్ దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల ఇదే జిల్లా అచ్యుతాపురం సెజ్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.