విజయనగరం జిల్లా : దత్తరాజేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికారుగంజి సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కారు ఒడిశా నుంచి విజయనగరం వైపు వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం కారును పరిశీలించగా.. కారులో గంజాయి ప్యాకెట్లు దొరికాయి. దాంతో గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కల్వర్టును నిర్మిస్తున్నారు. ఒడిశా నుంచి వస్తున్న కారొకటి కల్వర్టును ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలోకి బోల్తాపడింది. దాంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలతో ఉన్న కారును జేసీబీ సహాయంతో బయటికి తీశారు. కల్వర్లు పనులను గమనించక కారును ముందుకు పోనీయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
కారు నంబర్ ఆధారంగా మృతిచెందిన వారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. కారులో 12 గంజాయి ప్యాకెట్లు దొరికడంతో.. గంజాయి సరఫరా చేస్తూ ఇలా ప్రమాదానికి గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. మృతులు గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న కల్వర్టును గుర్తించకపోవడం, కారు అతివేగంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.