అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్ దక్కింది. ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి కమిషనర్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏబీపై ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దాంతో 2022 మే 19 న జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఏబీవీ రిపోర్టు చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్ స్థానంలో ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఆ సమయంలో సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. దాంతో ఆయనను ఏపీ ప్రభుత్వం విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అవినీతి జరిగిందని, ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ప్రభుత్వం నిర్ణయంపై ఏబీవీ కోర్టును ఆశ్రయించడంతో.. ఆయనపై సస్సెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రెండేండ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని పేర్కొంటూ.. ఏబీవీని తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది.