అమరావతి : ముఖ్యమంత్రిగా పని చేసే వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) తెలిపారు. అధికారం ఉంది కదా అని చంద్రబాబు (Chandra Babu) విలువలకు తిలోదకాలు ఇచ్చి దారుణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, పెందుర్తి , పాయకరావుపేట నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంపీటీసీ, జడ్పీటీసీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ వారితో మాట్లాడారు.
నిన్న జరిగిన విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ అన్యాయంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. మెజార్టీలేని చోట ప్రలోభాలకు గురిచేయడం, పోలీసులతో భయపెట్టి ఓట్లు వేయించు కున్నారని విమర్శించారు. రాబోయే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి 600 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని, టీడీపీకి 2 వందల మంది ప్రజాప్రతినిధులే ఉండగా పోటీకి సై అంటున్నారని తెలిపారు.
మెజార్టీ లేకున్నా దొడ్డిదారిన గెలిచేందుకు చంద్రబాబు కూటమి ఎత్తులు వేస్తుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే తీర్పు చాలా కీలకమని ఉద్ఘాటించారు. అధికార, ధనబలంతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నారని, ప్రతి ఒక్కరినీ డబ్బుతో కొనలేరన్న సంకేతాలు పంపాలని సూచించారు.
రాబోయే రోజుల్లో వైసీపీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువై పనిచేస్తే ప్రజలే చంద్రబాబును నామరూపాల్లేకుండా చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా పలావు పెట్టాడు అంటారు. చంద్రబాబు గురించి అడిగితే బిర్యానీ పెడతానని మోసం చేశాడని అంటున్నారు. ఇప్పుడు పలావు పోయింది. బిర్యానీ పోయింది’ అని అన్నారు.