AP News | విజయనగరం : తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. ఈ చలి నుంచి తట్టుకునేందుకు వృద్ధులు చలి మంటలను కాచుకుంటున్నారు. చలి మంటలు దుప్పటికి అంటుకోవడంతో ఓ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బొద్దాం గ్రామంలో చలి విపరీతంగా ఉండటంతో, తట్టుకునేందుకు ఓ వృద్ధుడు పశువుల పాకలో చలి మంటలు పెట్టుకున్నాడు. పాకలో నిద్రిస్తున్న తిమ్మ నాగమయ్య(75) అనే వృద్ధుడి దుప్పటికి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆయన సజీవదహనం అయ్యాడు. అనారోగ్యంతో మంచం పట్టిన ఆయన.. చలి కాచుకునేందుకు పెట్టిన మంటలు దుప్పటికి అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య సన్యాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.