Murder : ఆ ఇద్దరి మధ్య పెళ్లిచూపులు జరిగాయి. కొన్నిరోజులు విషయాన్ని పెండింగ్లో పెట్టిన తర్వాత అబ్బాయి పొట్టిగా ఉన్నాడని, తమకు ఇష్టంలేదని అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. కానీ పెళ్లిచూపుల నాడే ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్న అబ్బాయి, అమ్మాయి నిత్యం మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు. అమ్మాయి పేరెంట్స్ పెళ్లికి నో చెప్పడంతో 10 రోజుల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో ఆ అమ్మాయి అన్న తన బావను నడిరోడ్డుపై నరికి చంపాడు. ఏపీలోని బాపట్ల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్ కుటుంబసభ్యులు తమకు దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లారు. తొలిచూపులోని గణేశ్ అమ్మాయిని నచ్చాడు. కానీ అంజనీ దేవి పేరెంట్స్ మాత్రం ఆలోచించుకుని ఫోన్ చేస్తాం అని చెప్పారు. కానీ పేరెంట్స్కు తెలియకుండా గణేశ్, అంజనీ దేవి ఒకరికొకరు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
రోజూ ఫోన్లో మాట్లాడుకుని ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. ఇంతలో అంజనీ పేరెంట్స్ గణేశ్ పేరెంట్స్కు ఫోన్ చేసి తమకు పెళ్లి ఇష్టంలేదని చెప్పారు. అబ్బాయి పొట్టిగా ఉన్నాడనే కారణంతో వారు పెళ్లికి నిరాకరించారు. దాంతో అప్పటికే ప్రేమలో ఉన్న గణేశ్, అంజనీ ఇద్దరూ 10 రోజుల క్రితం పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. తమకు ఇష్టంలేదని చెప్పినా తన చెల్లిని పెళ్లి చేసుకున్న దుర్గారావుకు అంజనీ అన్న చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
దాంతో గణేశ్ తన భార్య కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పెళ్లి గుడిలో సింపుల్గా చేసుకున్నందున, రిసెప్షన్ గ్రాండ్గా చేసుకోవాలని గణేశ్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వెళ్తుండగా.. స్నేహితులతో వచ్చిన దుర్గారావు నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా నరికిచంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.
హత్యకు పాల్పడిన దుర్గారావును, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. బావ పొట్టిగా ఉన్నాడని, అతను తమకు నచ్చలేదని, అయినా తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని, అందుకే చంపేశానని పోలీసులు విచారణలో దుర్గారావు తెలిపాడు. కాగా ఘటనపై దర్యాప్తు సాగుతోందని, విచారణలో కచ్చితమైన వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్పారు.