AP Tenth Results | అమరావతి : ఏపీ పదో తరగతి ఫలితాల్లో కాకినాడ అమ్మాయి అరుదైన రికార్డు సాధించింది. ఏపీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ సాధించని మార్కులు ఆ విద్యార్థిని సాధించింది. తొలిసారిగా 600కు 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. ఈ చరిత్ర సృష్టించిన అమ్మాయి పేరు నేహాంజని. కాకినాడ భాష్యం స్కూల్లో పదో తరగతి చదివింది. 600కు 600 మార్కులు సాధించిన నేహాంజనికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యం సంతోషంలో మునిగిపోయారు.
ఏపీ టెన్త్ ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 4,98,585 మంది పాసైనట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 19 నుంచి 28 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.