Kodali Nani | మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి వాలంటీర్లు షాకిచ్చారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై కేసు నమోదైంది.
కొడాలి నానితోపాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో ఇద్దరు వైసీపీ నేతలపై ఐపీసీ సెక్షన్ 447, 506 కింద ఈ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, తాడేపల్లిలో గురువారం జరిగిన వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రుషికొండలోని భవనాలను జగన్ నివాసాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం శాఖ కోసం నిర్మించిన బ్లాక్లను వైఎస్ జగన్ నివాసాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఎప్పుడు కూడా ప్రభుత్వ భవనాల్లో ఉండలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన ఖర్మ జగన్కు లేదని.. వైజాగ్లో సొంతిల్లు కట్టుకుని షిఫ్ట్ అవుతారని తెలిపారు. ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని.. వైసీపీ నేతలకు జగన్ ధైర్యం చెప్పారని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటామని, తమ అధినేత కూడా ఇదే విషయం చెప్పారని అన్నారు.