YS Jagan | వినాయక నిమజ్జనం సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పాటలు పెట్టినందుకు వైఎస్ఆర్ జిల్లాలో ఓ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌ను కీర్తిస్తూ మైక్‌లో పాటలు పెడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తించారని టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
వైఎస్ఆర్ జిల్లా బి.కొత్తకోటలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 13వ తేదీ రాత్రి ఊరేగింపు నిర్వహించారు. స్థానిక జ్యోతి బస్టాండ్ సమీపంలోకి వచ్చిన తర్వాత అక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని చూసేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అదే సమయంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు ‘ కావాలని జగన్.. రావాలి జగన్’ పాటను ప్లే చేశారు. ఆ తర్వాత కొంతమంది వైసీపీ జెండాలతో ర్యాలీకి సిద్దమయ్యారు. ఇది గమనించిన టీడీపీ నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మదనపల్లి డీఎస్పీ కొండల నాయుడు శనివారం నాడు ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించారు. ఊరేగింపులో ఒక పార్టీకి సంబంధించిన పాటలు ఎందుకు వేశారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. దీనిపై డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ. ఊరేగింపు సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన కమిటీ సభ్యుల్లో బాధ్యులను గుర్తించి చట్టపరంగా విచారిస్తామని తెలిపారు.
ఓ గణేశ్ ఉత్సవ కమిటీ