తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 64,447 మంది భక్తులు దర్శించుకోగా 25,555 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.38 కోట్లు ఆదాయం(Income) వచ్చిందన్నారు.
కపిలేశ్వరాలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో
తిరుపతి కపిలేశ్వర స్వామివారి ఆలయానికి రానున్న కార్తీక మాసంలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామివారి ఆలయం, కళ్యాణకట్ట, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయశాల, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, పుష్కరిణి, క్యూ లైన్లను పరిశీలించి, కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు, అగర బత్తుల విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, డీఎఫ్వో శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.