AP News | ఐదో తరగతి బాలుడు తన తల్లికి పునర్జన్మను ప్రసాదించాడు. కరెంటు షాక్‌తో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లిని సమయస్ఫూర్తితో కాపాడాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామానికి చెందిన నక్క దీక్షిత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. దీక్షిత్ తల్లి నక్క శ్యామల ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. శుక్రవారం ఉదయం ఇంట్లో మోటర్ వేసి వాకిలి శుభ్రం చేసింది. అనంతరం తడి చేతులతోనే మోటర్‌ను ఆపేందుకు వెళ్లగా కరెంట్‌షాక్‌కు గురైంది. అదే సమయంలో స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్‌కు వస్తానన్న తల్లి ఇంకా రాకపోవడంతో ఆమెను తీసుకెళ్లేందుకు దీక్షిత్ ఇంటికి వచ్చాడు. అప్పటికే కరెంట్ షాక్‌తో శ్యామల కొట్టుమిట్టాడుతూ కనిపించింది. అయితే అది చూసి భయపడిపోయి దీక్షిత్ అందర్నీ పిలిచే ప్రయత్నం చేయలేదు. ఇరుగుపొరుగు వారు వచ్చి కాపాడేంత సమయం లేదని గ్రహించి, సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వెంటనే మోటర్ స్విచ్‌ను చాకచక్యంగా ఆపేశాడు. అనంతరం తల్లికి తగిలిన కరెంటు వైర్‌ను తొలగించాడు.
ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్లకు విషయం చెప్పడంతో వారు వచ్చి శ్యామలకు సపర్యలు చేశారు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం తల్లితో కలిసి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్‌కు దీక్షిత్ హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, ఉపాధ్యాయులు దీక్షిత్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. దీక్షిత్ చాకచక్యంగా వ్యవహరించి తల్లికి పునర్జన్మ ఇచ్చాడని ప్రశంసించారు.