హైదరాబాద్, మే 18 (నమస్తేతెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో పది మంది మృతిచెందారు. విజయనగరం జిల్లా కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో కారు లాక్ పడటంతో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు ప్రా ణాలు కోల్పోయారు. సరదాగా ఆడుకునేందుకు కారు లోపలికి వెళ్లిన తర్వాత లాక్ పడటంతో ఊపిరి ఆడక ఉదయ్(8), చారుమతి(8), చరిష్మా(6), మనస్వి(6) మృతిచెందారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్ల్లు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురంలో నీటి గుంతలో పడి మరో ముగ్గురు చిన్నారులు మృతిచెందా రు. శాలిని(5), అశ్విన్(6), గౌతమి(8) ఇంటి పునాది కోసం తవ్విన గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు.
అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బాలమువారిపల్లి వద్ద కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన శివన్న, లోకేశ్, గంగులయ్య, సునీల్, తిప్పారెడ్డి పీలేరులో క్యాటరింగ్ పనులు చేసేందుకు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున పీలేరు మండలం బాలమువారిపల్లె వ్యవసాయ పొలాల సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. సునీల్, తిప్పారెడ్డి ప్రాణాలతో బయటపడగా శివన్న, లోకేశ్, గంగులయ్య మృతిచెందారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.