AP News | గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని, దీనికి వాలంటీర్లే కారణమని పవన్ కల్యాణ్ సహా కూటమి పార్టీ నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు అని తేలిపోయిందని వైసీపీ ట్విట్టర్(ఎక్స్) ద్వారా పేర్కొంది. రాష్ట్రంలో బాలికలు, యువతులు అదృశ్యమైపోతున్నారని, వారంతా అక్రమ రవాణాకు గురవుతున్నారని, దీనికి వాలంటీర్లే కారణమంటూ ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు చేసిన అమానవీయ వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని, పచ్చి అబద్ధాలని లోక్‌సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది.
☞ 2019లో బాలికలు/యువతులు కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 6,896 ఇందులో ట్రేస్ అయిన వారి సంఖ్య 6,583
☞ 2020లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 7,576 ట్రేస్ చేసిన వారి సంఖ్య 7,189
☞ 2021లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 10,085 ట్రేస్ చేసిన వారి సంఖ్య 9,616
☞ 2022లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 10,433, ట్రేస్ చేసిన వారి సంఖ్య 10,994 ( అంతకు ముందు సంవత్సరాల్లో ట్రేస్ కానివారిని గుర్తించడంతో ఇక్కడ సంఖ్య పెరిగింది)
☞ 2023లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 9,695 ట్రేస్ చేసినవారి సంఖ్య 9,640
దిశ యాప్ ఉండటం, స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసుల వద్దకు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారని వైసీపీ పేర్కొంది. దీంతో ఫిర్యాదుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్టుగా కనిపించినా… పరిష్కారంలో కూడా అంతే సమర్థత చూపించగలిగారని చెప్పింది.
మిస్సింగ్ కేసులను పరిశీలిస్తే పలు కారణాలు ఉన్నాయని వైసీపీ తెలిపింది. అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో తప్పడం, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలు తదితర కారణాలు ఉంటాయని పేర్కొంది. ఈ ఘటనలను అన్నింటిలోనూ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేస్తారని.. ఇలాంటి కేసులను రాజకీయంగా వాడుకుని తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడింది. రికార్డుల్లో ట్రేస్ కాని వారు కూడా తమ తమ జీవితాల్లో స్థిరపడ్డాం, ఆయా కుటుంబాలతో రాజీచేసుకోవడం లాంటి పరిణామాల వల్ల ఇవి కూడా నమోదు కాలేదని చెప్పింది. ఇదే చంద్రబాబు గత హయాంలో (2015-18)మధ్య ట్రేస్ కాని ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య 1,542 మంది ఉన్నారని.. అంటే వాళ్లంతా అక్రమ రవాణాకు గురైనట్టేనా? తప్పుడు ప్రచారాలు చేసినవారు, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించింది.