కర్నూలు: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మహిళలను అత్యంత గౌరవంగా చూస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అదనపు ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని కొండారెడ్డి బురుజు నుంచి 3 కిలోమీటర్ల పరుగును జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. మహిళల రక్షణ విషయంలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారని అన్నారు.
మహిళలు లేకుండా మానవాళి ఉనికి అసాధ్యమని, తల్లి, సోదరి, భార్య.. ఇలా సమాజంలో మహిళ అనేక పాత్రలు పోషించి మెప్పిస్తారని తుహిన్ సిన్హా చెప్పారు. చదువుకున్న తల్లి ఆ కుటుంబానికి వెలుగులు నింపుతుందని, పిల్లలకు మొదటి గురువుగా, వైద్యురాలుగా సేవలందిస్తుందని అన్నారు. ప్రతి ఇంటిలో కొలువై ఉండే సజీవ దేవతకు మరొక రూపం తల్లి అని కొనియాడారు. సహనానికి మహిళలే బెస్ట్ ఎగ్జాంపుల్ అని తుహిన్ సిన్హా అన్నారు. మహిళా సాధికారత కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆత్మకూర్ డీఎస్పీ శృతి మాట్లాడుతూ.. ఇంట్లో, సమాజంలో వేధింపులు ఎదుర్కొంటున్న వారెవరైనా దిశా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించవచ్చునని సూచించారు. దిశా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఇది మహిళలు, బాలికలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
రాజ్‌విహార్ సెంటర్లో సమావేశం అనంతరం రన్లో పాల్గొన్న కేవీఆర్ కళాశాల విద్యార్థులకు ఏఎస్పీ ప్రోత్సాహక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల విద్యార్థులతో పాటు పోలీస్ శాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు. రన్లో ఏఎస్పీలు రమణ, నాగబాబు, డీఎస్పీ మహేశ్, పోలీసు సంక్షేమ దవాఖాన వైద్యురాలు స్రవంతి, దిశ పోలీస్ స్టేషన్ సీఐ సుగుణకుమారి, ఆర్ఐలు వీఎస్ రమణ, సుధాకర్, శివారెడ్డి, దిశ మహిళా పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.