అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈనెల 21, 22వ తేదీల్లో పోలవరం నిర్వాసితులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ఏపీ సీఎం జగన్ తీరుపై మండిపడ్డారు. కాలికి బురద అంటకుండా హెలికాప్టర్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా అని నిలదీశారు.
వరద నేపథ్యంలో పోలవం కాఫర్ డ్యాం ఎత్తుపెంచుతూ తీసుకున్న నిర్ణయం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మూడేండ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని పట్టించుకోకపోవడం తోనే వరద ప్రభావ ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు.
కాగా మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ గోదావరి వరద బాధితులకు అండగా నిలవాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. పండ్లు, తినుబండారాలు, మంచినీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.