AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. పేలుడు ధాటికి గోడతోపాటు మొదటి అంతస్తు స్లాబ్ కూలడంతో శిథిలాల కింద చాలామంది నలిగిపోయారు. దీంతో శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
మృతులను హారిక, మోహన్, చిన్నారావు, రాజశేఖర్, మహేశ్, సన్యాసి నాయుడు, రామిరెడ్డి, పార్థసారథి, గణేశ్, ప్రశాంత్, నారాయణగా గుర్తించారు. ఈ ఘటనలో 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్ పేలింది. భారీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 300 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.
అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా వైజాగ్ లేదా హైదరాబాద్‌కు క్షతగాత్రులను తరలించాలని సూచించారు. కాగా, గురువారం నాడు చంద్రబాబు అచ్యుతాపురం వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన సెజ్‌ను కూడా ఆయన పరిశీలించనున్నారు.