తిరుపతి : కరీంనగర్లో నిర్మిస్తున్న టీటీడీ ఆలయానికి రూ. 15.54 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం టీటీడీ (TTD) పాలకవర్గ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. గత నాలుగు నెలల క్రితం కరీంనగర్ పట్టణ సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
అలిపిరి(Alpiri) గోశాల వద్ద ఈనెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించడానికి సమావేశం నిర్ణయించింది. ఈ హోమంలో పాల్గొనే భక్తులకు రూ.వెయ్యి రుసుంగా చెల్లించాలని సూచించింది.
దీంతో పాటు టీటీడీలో అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నారు. ఆలయంలో శాశ్వత ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమనంగా రూ. 14 వేలు, ఒప్పంద ఉద్యోగులకు రూ.6,850 ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పప్పు దినుసులు, చక్కెర, నెయ్యి నిల్వకు అలిపిరి వద్ద మరో గిడ్డంగి నిర్మాణం చేపట్టాలని పాలక మండలి తీర్మానించింది. తిరుమలకు నడకదారిన వచ్చే భక్తులు వన్యమృగాల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవడానికి భద్రతా పరికరాల కొనుగోలుకు రూ.3.5 కోట్లు మంజూరు చేసింది.